పాతికేళ్ళ ప్రస్థానం

తెలుగు సినీ రచయితల సంఘం – పాతికేళ్ళ ప్రస్థానం :

 

అది 1993. మద్రాసు నుండి అప్పటికే హైదరాబాదుకి సినిమా వాళ్ళు తరలివస్తున్న రోజులవి. కీ॥శే॥ ఆరుద్ర, కీ॥శే॥ ఆత్రేయ, శ్రీ యస్.పి.బాలు, శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు, డా॥ పరుచూరి గోపాలకృష్ణ, శ్రీ వెన్నెలకంటి, శ్రీమతి పాటిబండ్ల విజయలక్ష్మి, ఇలా చిన్న, పెద్ద రచయితలంతా మద్రాసు కోడంబాకం యం.యం. థియేటర్లో సమావేశం అయ్యారు. 

 

అంతకుముందు రచయితల సంఘం మద్రాసులో కీ॥శే॥ ఆత్రేయ, కీ॥శే॥ ఆరుద్ర ఆధ్వర్యంలో కొంతకాలం నడిచినప్పటికీ అనాటికి యాక్టీవ్గా లేదు. సినీ రచయితలు అందరూ కలిసి ఆ రోజు ఒక రచయితల సంఘాన్ని ఏర్పరచుకోవాలని తీర్మానం చేశారు. కీ॥శే॥ డి.వి నరసరాజు గారు అధ్యక్షుడిగా, శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా, నేను (ఆకెళ్ళ) కోశాధికారిగా ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

ఆకెళ్ళ గారి పలుకులు

తెలుగునాట అప్పటికే సినిమా విభాగాలకు సంఘాలు ఉన్నాయి. అది కీ॥శే॥ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచనకి ప్రతిరూపమే, అందుకే ఆనాడే ఆయన మార్గదర్శకులయ్యారు.

 

అప్పటికే శ్రీ ఏల్చూరి వెంకట్రావు కార్యదర్శిగా నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ సినీ రచయితల సంఘాన్ని మద్రాసు నుంచి వచ్చిన మేము దాన్ని కొనసాగించడం జరిగింది. అంతకుముందు మద్రాసులో అనుకున్న కార్యవర్గమే సంఘాన్ని నడిపించడానికి ఎన్నుకోబడింది.


ఆ రోజుల్లో కార్యవర్గ సమావేశానికి ఎవరూ వచ్చేవారు కాదు. ఒక ఆఫీస్ అంటూ లేకపోవడం వల్ల ఫిల్మ్ నగర్ క్లబ్ లోనో, కీ॥శే॥ ప్రభాకర్ రెడ్డి గారి క్లబ్ లోనో, కీ॥శే॥ డి.వి నరసరాజు గారు అధ్యక్షునిగా కార్యవర్గ సమావేశాలు జరిగేవి. ఆ సమావేశాలకు శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు, నేను మాత్రం క్రమం తప్పకుండా హాజరయ్యే వాళ్ళం.

 

అలా 1994 లో ప్రారంభమైన ఈ రచయితల సంఘం కొన్ని రోజులు మధురానగర్ లో మా ఇల్లు కార్యాలయంగా, ఆ తర్వాత శ్రీ దివాకరబాబు మాడభూషి గారు ప్రధానకార్యదర్శిగా అతని ఇంట్లోనూ ఆఫీసు నడిచింది. శ్రీ పరుచూరి గోపాలకృష్ణ అధ్యక్షుడు అయిన తరువాత, ఆయన ఇంటి పక్క వీధిలోనూ, కృష్ణానగర్ లో రెండు చోట్ల, ఇలా చాలా చోట్లకి కార్యాలయం మార్చాము.

కీ॥శే॥ డి.వి నరసరాజు… కీ॥శే॥ జంధ్యాల…. శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు … డా. పరుచూరి గోపాలకృష్ణ …శ్రీ కె.యల్. ప్రసాద్… అధ్యక్షులుగా పనిచేసారు. మొదట్లో గుమస్తాలు లేరు. చాలాకాలం అన్ని పనులు అధ్యక్షుడు, ట్రెజరర్, కోశాధికారి చెయ్యవలసి వచ్చేది.


2005లో శ్రీ చిన్నికృష్ణ అధ్యక్షుడిగా, డా.పరుచూరి గోపాలకృష్ణ ప్రధాన కార్యదర్శిగా ఉండగా, 2006లో మనకి అప్పటికి ఒక కార్యాలయం ఏర్పడింది, ఆ తరువాత హంసా గ్రంధాలయం పోర్షన్ని 2007లో కొనడం జరిగింది.


రచయితల వెల్ఫేర్ ట్రస్ట్ :

 

2012 సంవత్సరం నేను ప్రధానకార్యదర్శి గా పనిచేస్తున్నపుడు, మన కార్యాలయం పక్కన ఉన్న పోర్షన్ కూడా కొనే అవకాశం వచ్చింది. డాపరుచూరి గోపాలకృష్ణ చొరవతో దానిని కొని, తెలుగు సినీ రచయితల వెల్ఫేర్ ట్రస్ట్ కార్యాలయంగా తీర్చిదిద్దడం జరిగింది.


మన సంఘ సభ్యులను, ఆపదలో ఉన్న వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి తెలుగు సినీ రచయితల వెల్ఫేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సర్వసభ్య సమావేశంలో 8 మంది ట్రస్టీలను (డా. పరుచూరి గోపాలకృష్ణ, శ్రీ ఆకెళ్ళ, శ్రీ పి.సత్యానంద్, శ్రీ వి.విజయేంద్రప్రసాద్, శ్రీ యన్.వి సుబ్బరాజు, డా. వడ్డేపల్లి కృష్ణ, డా. సుద్దాల అశోక్ తేజ, శ్రీమతి బలభద్రపాత్రుని రమణి), ముగ్గురుని ఎక్స్`అఫిషియో ట్రస్టీస్గా (శ్రీ కె.చంద్రబోస్, శ్రీ కె.ఆదిత్య,శ్రీ దాసం వెంకట్రావు) ఎంపిక చేయడం జరిగింది. ట్రస్టీలు అంతా కలిసి డా.పరుచూరి గోపాలకృష్ణని చైర్మన్గా,శ్రీ ఆకెళ్ళని మేనేజింగ్ ట్రస్టీగా, శ్రీ చంద్రబోస్ను కోశాధికారిగా ఎన్నుకున్నారు. ఈ క్రింది వారిని సలహా సంఘ సభ్యులుగా నియమించడం జరిగింది. శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు, శ్రీ కె.యల్.ప్రసాద్, శ్రీ దివాకర్ బాబు,శ్రీ చంద్రశేఖర్ ఆజాద్, శ్రీ బల్లెం వేణుమాధవ్, శ్రీ కాకర్ల, శ్రీమతి ఉమర్జీ అనురాధ.


మన సంఘ సభ్యుల్ని ఆదుకోవడమే కాక, ఇతర విభాగాలలో ఉన్న సినీ కార్మికులకు, ఇతర సామాన్యులకు కూడా సహాయం అందిస్తున్నాము. ఆదాయ పన్నుల శాఖ నుంచి 12 ఏ, 80జి (పన్ను రాయితీ) పొందగలిగాము.


కీ॥శే॥ డి.వి.నరసరాజు, శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు, కీ॥శే॥ లు జంధ్యాల, శ్రీ సూర్యదేవర రామ్మోహన్రావు,శ్రీ దివాకర్ బాబు, డా.పరుచూరి గోపాలకృష్ణ, శ్రీ కె.ఎల్.ప్రసాద్, శ్రీ జొన్నవిత్తుల, కీ॥శే॥ లు పూసల, శ్రీ చంద్రశేఖర్ ఆజాద్, శ్రీ ఆకుల చిన్నికృష్ణ, శ్రీ వి.ఎన్.ఆదిత్య, శ్రీ సత్యం యాబి, శ్రీ విశ్వ విజయేంద్రప్రసాద్, శ్రీమతి బలభద్రపాత్రుని రమణి, శ్రీ కాకర్ల, శ్రీ యన్.వి సుబ్బరాజు, శ్రీ ప్రాణమిత్ర, శ్రీ జయసింహా రెడ్డి, శ్రీమతి ఉమర్జీ అనురాధ, శ్రీ జి.ఎస్.రావు, శ్రీ కె ఆదిత్య, శ్రీ ఎస్ వి.రామారావు, డా॥ వెనిగళ్ల రాంబాబు, శ్రీ బల్లెం వేణుమాధవ్, శ్రీ నాగబాల సురేష్ కుమార్, శ్రీ దురికి మోహన్ రావు, శ్రీ సి.హెచ్ నటరాజ్ గోపాల మూర్తి, శ్రీమతి లక్ష్మి శాంతి, లాంటి ఎందరో సంఘటితంగా సంఘం అభివృద్ధికి భాగస్వాములయ్యారు.ఇంకా ఎందరో మహానుభావుల కృషి కూడా ఉంది, వారందరి పేర్లు స్థలాభావం వల్ల ఉదహరించలేకపోతున్నాను.


గ్రూప్ ఇన్సూరెన్స్ :

 

మన సభ్యుల సంక్షేమం కోసం వారికి కార్మిక శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి గ్రూప్ ఇన్సూరెన్స్ చేసాము.


ఆంధ్ర రాజధాని దగ్గరలో స్థలం :

 

ఉభయ రాష్ట్రాలలో మన సంఘం కార్యకలాపాలు నిర్వహించుకోవలసిన అవసరం దృష్ట్యా, భవిష్యత్ కార్యాలయ నిర్వహణ కోసం, ఆంధ్ర రాజధానికి దగ్గరలో స్థలం కొనమని సర్వసభ్యులు ఆదేశించారు.ఆ ఆదేశం మేరకు విజయవాడ సమీపంలో ఇంద్రప్రస్థ ఎన్క్లేవ్లో 700 చదరపు గజాల స్థలాన్ని కొని, భూమిపూజ చేసి, అక్కడ రెండు కార్యవర్గ సమావేశాలతోపాటు, వన భోజన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ స్థలం కొనడంలో డా.పరుచూరి గోపాలకృష్ణ, నాతోపాటు శ్రీ కోశాధికారి శ్రీ కాకర్ల ఎంతో శ్రమించారు వారికి కృతజ్ఞతలు.


వానప్రస్థం :

 

ప్రఖ్యాత నటులు శ్రీ విజయచందర్ గారు కరకపట్ల గ్రామం శివార్లలో మన సంఘానికి విరాళంగా ఇచ్చిన ఎకరం స్థలంలో ‘వానప్రస్థం’ పేరుతో మన రచయితల కోసం ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించుకోవాలనే దృఢసంకల్పంతో ఉన్నాము. దీనికోసం ఇంతకు ముందే సర్వసభ్యసమావేశంలో 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంలోనే మన సంస్థకు ఎకరం స్థలాన్ని విరాళంగా ఇచ్చిన శ్రీ విజయచందర్ గారిని సత్కరించి, కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకున్నాము. త్వరలో వృద్ధాశ్రమ నిర్మాణానికి ఉపక్రమించడానికి సిద్ధంగా ఉన్నాము.


ఉగాది పురస్కారాలు :

 

మన సంఘ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి, ఏదైనా గుర్తింపు పొందిన పురస్కారాలు పొందితే, మన సంఘం తరపున వారికి, ఉగాది పురస్కారాలు అందించి మనం కూడా వారిని ఉగాదినాడు సత్కరించుకున్నాము.


కథల రిజిస్ట్రేషన్ :

 

తెలుగు సినీ రచయితల సంఘం సగర్వంగా చెప్పుకునే అంశం ‘‘కథల రిజిస్ట్రేషన్ ప్రక్రియ’’. ఒక రచయిత తన రచనని ప్రాణంగా చూసుకుంటాడు. అందుకే కథా చౌర్యాన్ని అరికట్టేందుకు రచయితలు తమ రచనలు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని తెలుగు సినీ రచయితల సంఘం కల్పించింది. మొదట్లో అధ్యక్షుడు, ప్రధానకార్యదర్శి మాత్రమే ఆ స్క్రిప్ట్ల మీద సంతకం పెట్టేవారు.రోజురోజుకి స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్స్ పెరగడం వల్ల, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు కూడా స్క్రిప్ట్ల మీద సంతకం పెట్టడానికి అధికారం ఇవ్వబడింది.


కథాహక్కుల వేదిక :

 

రచయితల సంఘం సభ్యులతో పాటు, దర్శక సంఘం సభ్యులకు, నిర్మాతల మండలి సభ్యులకు కూడా తమ రచనలు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు మన సంఘం కల్పించింది. క్లిష్టమైన కేసులలో మన సంఘం విజయం సాధించడం వల్ల, రచయితలు విశేషంగా తమ కథల్ని రిజిష్టరు చేసుకుంటున్నారు. కథా వివాదాలను పరిష్కరించుకునేందుకు, మన సంఘం, దర్శక సంఘం సభ్యుల సమన్వయంతో, కథాహక్కుల వేదిక ఏర్పాటు చేయడం జరిగింది.


ఈ కథాహక్కుల వేదిక కి చైర్మన్గా కీ॥శే॥ లు దాసరి నారాయణ రావు గారు ఉండేవారు.ప్రస్తుతం డా॥ మంచు మోహన్బాబు గారు చైర్మన్ గా ఉన్నారు.ఈ కమిటి ఎన్నో వివాదాలు పరిష్కరించి రచయితలకు న్యాయం అందేలా చేసింది. ఇదంతా ఆషామాషీగా కాక, అన్నీ ‘లేబర్ కమిషన్’ మరియు ‘రిజిస్టర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్’ లో ప్రభుత్వంతో ఆమోద ముద్ర వేయించుకోవడం జరిగింది.


‘చారుశీల’ అనే చిత్రంపై కథా హక్కులకోసం ‘హైకోర్టు’ కి ఒక పిటిషన్ వేయబడింది. అప్పుడు ‘బాలచందర్’ గారి సినిమా ‘జూలి గణపతి’ చిత్రంకి ‘చారుశీల’ అనుకరణ అని అన్న అభియోగంలో ‘హైకోర్టు’ వారు, ‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ వారి ద్వారా మన రచయితలనెవరినైనా ఆ అభియోగంపై అభిప్రాయం కోరినపుడు, మన కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీ విజయేంద్రప్రసాద్ గారు మన అధ్యక్షులు డా.పరుచూరి గోపాలకృష్ణ గారిని సంప్రదించి, మనం అనుసరిస్తున్న కథాహక్కుల నియమాల గూర్చి పరిశీలించడం కూడా జరిగింది.


అ నియమావళిలో రూల్.నెం.9 ‘‘అభియోగానికి గురైన కథలో కాపీరైట్ ఉల్లంఘనకి చెప్పుకోదగ్గ భాగం, అంతకుముందు విడుదలయిన సినిమాలలో కాని, అచ్చు అయిన రచనల నుంచి కాని, రంగస్థల, రేడియో, టీ.వి. మొదలగు మాధ్యమాల ద్వారా కానీ, కాపీరైట్ పొంది ఉన్న భాగాలు ` ఉన్నట్లయితే అది నాది అనే హక్కు అభియోగం చేసిన, రచయితకు ఉండదు. ఎందుకనగా, ఆ ఎక్స్ప్రెషన్ యొక్క కాపీరైట్ వేరే వారికి ఉంది.’’ అనే నియమావళిని ఉటంకించగా, గౌరవ న్యాయస్థానం దానిని స్వీకరించి తీర్పునివ్వడం జరిగింది. నిర్దిష్టమైన ప్రణాళికచే, కథాహక్కుల అభియోగాలను పరిశీలించడంతో న్యాయస్థానాలు కూడా మన తీర్పులను భేష్ అని మెచ్చుకున్నాయి.


స్క్రీన్ ప్లే క్లాసులు :

 

మన సంఘం ఆధ్వర్యంలో కొత్తతరం రచయితల కోసం, సీనియర్ సినీ రచయితల చేత కథ, స్క్రీన్ప్లే, మాటలు, పాటల క్లాసులు నిర్వహించడం జరుగుతోంది. ఉభయ రాష్ట్రాలలో ఇప్పటికే పదిహేను సార్లు ఇలాంటి క్లాసులు నిర్వహించడం జరిగింది.మనసంఘ సభ్యులతో పాటు, ఆసక్తి గల యువకులు కూడా ఈ క్లాసుల్లో పాల్గొని వారి జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు.


అక్షరాంజలి :

 

దివంగతులైన రచయితలకు నివాళిగా శ్రీ ఎస్వీ రామారావు గారి సంపాదకత్వంలో వివిధ రచయితల చేత కీర్తిశేషులైన తెలుగు సినీ రచయితల జీవిత చరిత్రను వ్రాయించి అక్షరాంజలి అనే పుస్తకంగా ప్రచురించడం జరిగింది.


వనభోజనాలు :

 

రచయితల మధ్య కాక, రచయితల కుటుంబాల మధ్య కూడా అనుబంధాలు పెరగటానికి కార్తీకమాసంలో మన సంఘ సభ్యులందరికీ వనభోజనాలు కి ఏర్పాటు చేసి, వారి మధ్య ప్రేమాభిమానాలు పెరిగేందుకు ప్రయత్నం చేస్తున్నాం.


రజతోత్సవ వేడుకలు :

 

రజతోత్సవ ప్రారంభ సూచికగా జరిపిన పత్రికా సమావేశానికి రెబల్ స్టార్ శ్రీ కృష్ణంరాజు గారు హాజరై ఆ శుభారంబానికి శోభను చేకూర్చారు.రజతోత్సవ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా వచ్చి రచయితల సంఘానికి శుభాశీస్సులు అందజేసారు. మెగాస్టార్ తన చిత్రాలకు పని చేసిన రచయితల పేర్లు వరసగా చెప్పి రచయితలను ఆనందపరిచారు. దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్రరావు గారు పాల్గొనడం సభకు ఎంతో నిండుదనం కలిగించింది.సాంస్కృతిక లోకానికి బంధువైన శ్రీ.కె.వి.రమణాచారి గారు విశిష్ట అతిధిగా వచ్చి తన ప్రసంగంతో సభకు వన్నెలద్దారు. డా॥ మంచు మోహన్బాబు ఆత్మీయ అతిథిగా వచ్చి ఆత్మీయ ప్రసంగంతో తో అలరించడమే కాకుండా, ఎన్నో విశిష్ట పురస్కారాలు ప్రధానం చేసారు. ఎందరో ప్రముఖులు శ్రీ కె.యస్. రామారావు, శ్రీ శివాజీరాజా, శ్రీ దామోదరప్రసాద్, శ్రీ టి.ప్రసన్నకుమార్, శ్రీ రాంప్రసాద్, శ్రీ వై.కాశీ విశ్వనాథ్, విచ్చేసి రచయితల సంఘానికి తమ శుభాశీస్సులు అందజేసారు. రజతోత్సవం దిగ్విజయంగా ముగిసింది.


ఈ పాతికేళ్లలో నేను, 14 సంవత్సరాలు, ప్రధానకార్యదర్శి గానూ, 2 సంవత్సరాలు కోశాధికారిగానూ, 4 సంవత్సరాలు వివిధ పదవుల్లో ఉండి, సంఘానికి సేవ చేయడం, నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాతికేళ్ళ ప్రస్థానం దాటి రజతోత్సవం జరుపుకున్నాం. రచయితల సంఘం ప్రస్థానం ఇలాగే కొనసాగుతూ, మరి ఎన్నో విజయాలు సాధిస్తూ, స్వర్ణోత్సవానికి సమాయత్తం కావాలని, వందేళ్ళ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ…


సర్వేజనా.. సుఖినోభవంతు…భవదీయుడు


ఆకెళ్ళ (మాజీ ప్రధానకార్యర్శి)