అధ్యక్షులవారి పలుకులు

తెలుగు చలన చిత్ర రచయితల సంఘం నా దేవాలయం. అందులో నేను ప్రధాన అర్చకుణ్ణి. రచయిత అంటే సృష్టికర్తతో సమానం. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడిలా, తాను సమాజంలో గమనించిన చిన్న అంశాన్ని రెండున్నర గంటల పాటు కల్పిత పాత్రలతో ఎక్కడో ఇది జరిగింది అని విశ్వసింపజెయ్యగల సమర్ధులు రచయితలు.

 

ఎవరికి వారు నిష్ణాతులే. ఎవరికి వారు ప్రతిభావంతులే. అలాటి మేధోవంతులైన పదిహేనువందల మందికి నాయకత్వం వహించడం అంటే మాటలు కాదు. నొప్పింపిక, తానొవ్వక తప్పించుకుని తిరగడం ఇక్కడ వీలుకాదు. ఒప్పించి తీరాలి. విడమరిచి చెప్పాలి. సంఘానికి ఏది మంచో, ఏది చెడో అర్థమయ్యేలా చెప్పాలి.

 

1999లో నేను కాకినాడలో ఉన్నప్పుడు ఆకెళ్ళ ఫోన్‌ చేసి ‘బ్రదరూ నిన్ను మన సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నాము’ అని చెప్పినప్పుడు నాకు తెలియదు ఇన్ని సంవత్సరాలపాటు నన్ను ఎన్నుకుంటూనే వుంటారని.

ఆనాటి నుంచి ఈనాటి వరకు సొంత తమ్ముడిలాగానే వున్న ఆకెళ్ళని ఆశీర్వదిస్తున్నాను. నాతోపాటు అనుక్షణం కలసి పనిచేసిన శ్రీ సూర్యదేవర రామ్మోహన్‌రావు, శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు, శ్రీ తోటపల్లి సాయినాథ్‌, శ్రీ అజయ్‌ శాంతి, శ్రీమతి పాటిబండ్ల విజయలక్ష్మి, ఎస్‌.వి. రామారావు, సుబ్బరాజు, దాసం వెంక్రటావ్‌, వడ్డేపల్లి కృష్ణ, డా. పాలకోడేటి సత్యనారాయణ, కె. ఆదిత్య, పి. చంద్రశేఖర అజాద్‌, కె. దివాకర్‌ బాబు, చిన్ని కృష్ణ, సుద్దాల అశోక్‌ తేజ, శ్రీ కాశీ విశ్వనాథ్‌, కె. చంద్రబోస్‌, శ్రీ జనార్ధన మహర్షి, శ్రీ వక్కంతం వంశీ, డా. ఎల్‌. శ్రీనాథ్‌, వి.ఎన్‌. ఆదిత్య, యాబి సత్యం, కిలారి ప్రాణమిత్ర, జి.ఎస్‌. రావు, బల్లెం వేణుమాధవ్‌, శ్రీ సి.హెచ్‌. నటరాజ గోపాలమూర్తి, నాగబాల సురేష్‌ కుమార్‌, జయసింహారెడ్డి, డా. వెనిగెళ్ళ రాంబాబు, శ్రీ ఆకుల శివ, కాకర్ల, డార్లింగ్‌ స్వామి, దురికి మోహనరావు, డైమండ్‌ రత్నబాబు, కందికొండ, రవీంధ్రగోపాల, తైదల బాపు, శ్రీమతి బలభద్రపాత్రుని రమణి, శ్రీమతి ఉమర్జి అనురాధ, శ్రీమతి లక్ష్మీశాంతి అందరూ అనుక్షణం సంఘం కోసం చేసిన సేవలు గుర్తుపెట్టుకుంటూ వుంటాను.

 

చెట్టుకింద వున్న మన అసోసియేషన్‌ ఈ స్థాయికి తెచ్చారని నొక్కి వక్కాణించే జొన్నవిత్తుల గారిని, గోపాలకృష్ణ గారికి మన సంఘం నాలుగో కూతురు అని అభినందించే విజయేంద్రప్రసాద్‌ ని, బ్రదర్‌ జీవితకాల అధ్యక్షుడిగా ఉండాలని పదే పదే కోరుకునే కె.ఎల్‌. ప్రసాద్‌ ని ఎలా మరచిపోగలను?

 

మనం ట్రస్ట్‌ పెట్టుకుంటే సభ్యులకు మంచిది అని చెప్పగానే అంగీకరించిన కార్యవర్గానికి, ఆమోదించిన సభ్యులకు సర్వదా కృతజ్ఞుణ్ణి.

 

తెలుగు సినీ రచయితల సంఘం రజతోత్సవ సందర్భంగా కృషి చేసిన సాంస్కృతిక విభాగం వారికి, రజతోత్సవ సంచిక సంపాదక వర్గానికి, రజతోత్సవ సంచికలోని ముద్రారాక్షసాలను పట్టి పట్టి చూసి సరిచేసిన శ్రీ యస్‌.వి.రామారావు గారికి అభినందనలు.

 

మళ్ళీ జన్మ అంటూ వుంటే తెలుగు సినిమా రచయితగానే పుట్టాలని కోరుకుంటూ…

మీ

డా॥ పరుచూరి గోపాలకృష్ణ