స్క్రీన్‌ప్లే వర్క్‌షాప్‌లు

చలనచిత్ర రచన శిక్షణా తరగతులు

 

తెలుగు సినీ రచయితల సంఘ కార్యకలాపాల్లో ప్రముఖంగా చెప్పుకునే అంశాల్లో ప్రధానమైనది స్క్రీన్‌ ప్లే శిక్షణా తరగతులు. సినిమా రచన అంటే ఇష్టం ఉండి ఏం రాయాలో ఎలా రాయాలో తెలియక తికమక పడుతున్న ఎందరో యువ రచయితలకు మార్గ నిర్దెశనం చేస్తున్న కార్యక్రమం. ఇవి ప్రారంభించడానికి కారణమైన భూమికను గూర్చి రెండుమాటలు మాట్లాడుకోవాలి.

 

2007 వ సంవత్సరంలో తెలుగు సినీ రచయితల సంఘ అధ్యక్షులు డా. పరుచూరి గోపాల కృష్ణ తెలుగు విశ్వ విద్యాలయ పాలకమండలి సభ్యులుగా ఉండేవారు. ఆ సమావేశాలకు హాజరౌతున్న సమయంలో పూర్వాశ్రమంలో డా.పరుచూరి గోపాల కృష్ణ తో కలిసి చదువుకున్న ప్రాఫెసర్‌ ఆవుల మంజులత ఉప కులపతిగా ఉన్నారు. డా. గోపాలకృష్ణ తో తనకున్న పరిచయాన్ని పురస్కరించుకుని ఆవుల మంజులత తమ విశ్వ విద్యాలయ విద్యార్థులకు పాఠాలు చెప్పమని అడిగారు. డా. పరుచూరి గోపాల కృష్ణ అంగీకరించి విద్యార్థులకోసం స్క్రీన్‌ ప్లే తరగతులు నిర్వహించారు.

 

ఆ వర్క్‌ షాప్‌ విజయవంత మవడంతో 2008లో రెండవసారి మళ్ళీ నిర్వహించారు. అదికూడా విజయవంతమైంది. ఈ సంగతి తెలిసిన కొందరు సంఘ సభ్యులు సర్వ సభ్యసమావేశంలో మన రచయితల సంఘ పక్షాన ‘వర్క్‌ షాప్‌’ లు నిర్వహిస్తే బాగుంటుందని కోరారు.

 

వెంటనే డా. పరుచూరి గోపాల కృష్ణ త్వరలోనే నిర్వహిస్తామని ప్రకటించారు. అదే సమయంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయలో దూర విద్యద్వారా సినిమా రచన కోర్సును ప్రారంభించవలసిందిగా అప్పటి ఉపకులపతి ప్రొఫెసర్‌ అనుమాండ్ల భూమయ్య డా. పరుచూరి గోపాల కృష్ణను కోరారు. ఆయన అంగీకరించి ఆ ‘కోర్స్‌ డైరెక్టరు’గా

ఉండీ ‘కోర్స్‌’ ‘సిలబస్‌’ కోసం పాఠ్య పుస్తకాలను రచించడానికి పూనుకుని సినిమా రచనలో నిష్ణాతులైన వారిని పాఠాలు రాయమని అడిగారు. ఆయన సంపాదకత్వంలో రచయితల సంఘ ప్రధాన కార్యదర్శి ఆకెళ్ళ, ప్రస్తుత కోశాధికారి చిలుకమర్రి నటరాజ్‌, ప్రస్తుత కార్యవర్గ సభ్యులు కె. ఎల్‌.ప్రసాద్‌, తెలుగు విశ్వవిద్యాలయ ఉపన్యాసకులు డా. పెద్ది రామారావు,

డా. భల్లమూడి పద్మ ప్రియలు పాఠాలు రాసారు. ఆ ‘కోర్సు’ విజయవంతంగా నడవడంతో మన సంఘ సభ్యులే ఎక్కువమంది అక్కడ పాఠాలు చెబుతుండడంతో మన సంఘసభ్యులు ‘వర్క్షాప్‌’ నిర్వహించమని కోరుతుండడంతో సంఘం తరపున కూడా ‘స్క్రీన్‌ ప్లే’ వర్క్‌షాప్‌లు నిర్వహించడం ప్రారంభించారు.

 

14-4-2017లో తెలుగు సినీ రచయితల ‘వెల్ఫేర్‌ ట్రస్ట్  ప్రారభించబడిన తరువాత ‘వర్క్‌షాప్‌’ల నిర్వహణ భాధ్యతను ‘ట్రస్ట్‌’ చేపట్టింది. ‘ట్రస్‌’్ట అధ్వర్యంలో రెండుసార్లు హైదరాబాద్‌ లోనూ ఒకసారి విశాఖ పట్టణంలోనూ ‘స్క్రీన్‌ప్లే వర్క్‌షాప్‌’లు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు కూడా డా.పరుచూరి గోపాలకృష్ణ కథా బీజం, మలుపు, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లేలో తలెత్తే సమస్యలు వాటి పరిష్కారాలు, ఉపయోగాలు, సంఘటన, సన్నివేశం మొదలైన అంశాలను విశ్లేషిస్తూ బోధించారు.