స్టోరీ రిజిస్ట్రేషన్స్

కథలు ఎందుకు రిజిస్టరు చేసుకోవాలి?


ఒక ఆలోచనను కథగా రాయడం అంత తేలిక కాదు. అలాగే ఆ కథను నవలగా మార్చడమో, నాటికగా రాయడమో, నాటకం చేయడమో, టీవీ సీరియల్ చేయడం ఇలా రకరకాల రచనా ప్రక్రియల్లో అతి కష్టమైనది, క్లిష్టమైంది, ఛాలెంజింగ్ గా ఉండేది సినిమాకి కథ రాయడం.


ఈ సినిమా కథ రాయటం అనేది ఒక ఆడపిల్ల తల్లి కావడానికి తొమ్మిది నెలలు గర్భం మోసి, అతి జాగ్రత్తగా గర్భం నిలుపుకొని, పురిటినొప్పులు పడుతూ కాన్పు సమయంలో లైఫ్ ని ‘రిస్క్’ చేసి, ప్రాణగండంగా మారిన, ఆ ప్రసవంలో ఒక చక్కటి బిడ్డను కంటే ఎంత తృప్తి పొందుతుందో, ఒక సినిమా రచయిత కావాలనుకొనే వ్యక్తి కథను తయారుచేసుకుని, తీసుకెళ్ళి ఒక నిర్మాతనో, దర్శకుడినో, హీరోనో ఒప్పించే ముందు ఆ కథను కాపాడుకోవడం ముఖ్యం. ఆ కథను మన తెలుగు సినీ రచయితల సంఘంలో ‘రిజిష్టరు’ చేసుకోవచ్చు. అయితే మెంబర్స్ అయిన వారికి మాత్రమే ఈ కథలు ‘రిజిష్టరు’ చేయబడతాయి. ఆ తరువాత దాన్ని పట్టాలెక్కించి, సినిమా ప్రారంభమై షూటింగ్ చేసుకొని, సినిమా ‘ఫస్ట్ కాపీ’ రిలీజవుతుందన్నపుడు ఒక సుఖప్రసవం జరిగిన తల్లి లాంటిది. ఆ తల్లి పొందే అనుభూతే ఆ బిడ్డ పొందుతాడు.


పుట్టిన ప్రతి బిడ్డ ప్రయోజకుడు అవుతాడా అంటే చెప్పలేం. మేధావి అవుతాడా అంటే చెప్పలేం, డాక్టర్, ఇంజనీరు, లెక్షరరు, చివరికి ప్రధానమంత్రి కూడా కావచ్చు, మామూలు ఫ్యూనే కావచ్చు. మంచి పేరు తెచ్చుకోవచ్చు. అలాగే ఒక సినిమా మంచి సినిమా అనిపించుకోవచ్చు, రకరకాల ‘రిజల్ట్స్’ పొందొచ్చు. అది ఈ బిడ్డ పెంపకం ఏ రకంగా అయితే వాతావరణం, తల్లిదండ్రులు హెల్ప్ అవుతాయో ‘స్క్రీన్ ప్లే’ సంవిధానం, ఆ కథ తీర్చిదిద్దిన తీరు, పరిణితి చెందిన అనుభవం, ఆ అనుభవంలో పుట్టిన అనుభవ సారాన్ని రచయిత ఎప్పటికప్పుడు ‘అప్డేట్’ చేసుకునే తత్త్వం, ప్రతీ చిత్రం ఒక పరగడుపే.


357 చిత్రాలు రాసిన పరుచూరి బ్రదర్స్ కావచ్చు, కొత్తగా కథ రాస్తున్న రచయితే కావచ్చు, ఒక కథ రాస్తున్నప్పుడు వాళ్ళు పడే శ్రమ ఒకటే, ఎందుకంటే ఏ కథకి ఆ కథ, కథ సంవిధానం, స్క్రీన్ప్లే ఛాలెంజింగ్ గా తయారు చేయాలి. అప్డేట్ అవ్వాలి.ప్రతిరోజు రిలీజు అవుతున్న సినిమాలు ‘అనలైజ్’ చేసుకోవాలి. తరతరానికి మారుతున్న నవతరం, యువతరం అభిరుచులు దగ్గరగా పరిశీలించాలి. ఆ పరిశీలానాత్మక ధోరణిని తను రాసే కథలో ప్రతిబింబించేలా చేయాలి.


ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ తెలుగు సినీ రచయితల సంఘంలో మనం మెంబర్స్గా ఎందుకు ‘జాయిన్’ అవ్వాలి? అని. చాలా చక్కటి ప్రశ్న. ఒక 20 ఏళ్ళ క్రితం దీనికి సరైన సమాధానం ఇవ్వలేం, రెండేళ్ళుగా అందరికీ తెలిసిన విషయమే మీకు చెబుతున్నది. ఇది చాలా ‘పవర్ ఫుల్, ‘స్ట్రాంగ్ యూనియన్’.

దానికి సింపుల్ ఎగ్జాంపుల్ : కత్తి అనే సినిమా తమిళ్లో చేస్తే, తెలుగులో నరసింహరావు అనే అబ్బాయి ఆ కథ రాస్తే, ఆ కథ తమిల్ హీరో శ్రీ విజయ్ గారికి ఆ కథను శ్రీ నరసింహారావు తనకు చెప్పాడు అని నిరూపించి, అతనికి దర్శకత్వ అవకాశము మరియు ‘కాంపెనీసేషన్’ ‘అసోషియేషన్’ ఇప్పించడం జరిగింది. ఇంకా ఎన్నో ఉన్నాయి కాని ఉదహరణకు మాత్రమే, ఒక మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో, లేదో తెలుసుకోవచ్చు అలాంటిదే ఇది. ఈ ఒక్క ‘ఎగ్జాంపుల్’ తోనే ఎంత ‘పవర్ఫుల్’ ‘ఇండస్ట్రీ’ లో ఉన్నది తెలుగు సినీ రచయితల సంఘం. నిజంగా దీనిలో ‘మెంబర్’ అయినందుకు మీరు గర్వపడతారు, నేను గర్వపడుతున్నా.


అలాగే కథ రాసేవాడికి అనుకున్న వారికి ఖచ్చితమైన అవసరం ‘రిజిస్ట్రేషన్’.మీ కథని`స్టాంపింగ్ చేసి, ఇద్దరు కథా రిజిస్ట్రేషన్ కమిటి సభ్యులు సంతకాలు చేసి, మీకే వెంటనే ఇచ్చేస్తారు. కథ రాసుకోవడం మనల్ని, మన ఆలోచనల్ని ప్రపంచానికి తెలియజేసే ఓ సాధనం.అందుకే సినీ రచయితల సంఘం కథ భద్రత కొరకు ‘‘రిజిస్ట్రేషన్’’ వ్యవస్థని నెలకొల్పింది. దాన్ని సద్వినియోగం చేసుకొనే ‘ఛాయిస్’ మీదే.

తెలుగు సినీ రచయితల సంఘంలో కథ రిజిస్ట్రేషన్ చేసుకునే కథా రచయితలు అర్ధం చేసుకోవలసిన విషయాలు :

కథల రిజిస్ట్రేషన్ పైన ది. 01-10-2011 నాడు జరిగిన జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలు, ది. 07-02-2016 నాడు జరిగిన సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ది. 05-03-2017 జనరల్ బాడీలో, తరువాత ది. 08-03-17, 27-09-2019 నాటి కార్యవర్గ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది.

1. కేవలం ఐడియా మాత్రమే రిజిస్టర్ చేసుకుంటే దానికి కాపీరైట్ యాక్ట్ వుండదు. ఆయా సినిమాలకై 20 పేజీల కంటే తక్కువ కాకుండా రాసుకున్న కథ, ఎక్స్ప్రెషన్ విషయంలో కాపీ జరిగితేనే కథాహక్కు కోసం అభియోగం చేయాల్సి ఉంటుంది.


2. పురాణాలు, చారిత్రక సంఘటనలు, వాస్తవ సంఘటనల నుంచి స్వీకరించే ఐడియాకు ‘కాపీరైట్ యాక్ట్  వర్తించదు.


3. అక్కర్డ్ ఫాక్ట్ : నడుస్తున్న కాలంలో జరుగుతున్న వాస్తవాలు, పేపర్లో చదివో, వార్తలు చూసో రచయిత స్పందించి, ఆయా అంశాలతో కథ రాసుకుంటారు. ఇవన్నీ జరుగుతున్న వాస్తవాలు. కాబట్టి వాటిమీద ఎవరకీ ‘కాపీరైట్’ వుండదు. ఆ విషయంలో వారు రాసుకునే ఎక్స్ప్రెషన్కి మాత్రమే కాపీరైట్ ఉంటుంది.


4. ‘నా కథా హక్కులకు భంగం వాటిల్లింది’ అంటూ మీరు ‘కేసు’ పెట్టదల్చుకుంటే, ఏ కథకుడి మీద మీరు అభియోగం మోపారో అతని కథ, మీ కథ చదవగానే ‘కో-ఆర్డినేషన్’ కమిటీ, ‘కథాహక్కుల వేదిక’ సభ్యులకు ఎక్స్ప్రెషన్ కాపీ జరిగిందనే విశ్వాసం కలగాలి. అలా కలగాలి అంటే మీ రచన ‘ఒక సమగ్ర స్వరూపాన్ని’ కలిగి ఉండాలి.


మీ ‘సబ్జెక్టును’ ‘కథగా రిజిస్టరు’ చేసుకునేటప్పుడు కథలో పాత్రలు, వాటి మనస్తత్వాలు, సన్నివేశాలు అన్నీ విపులంగా ‘ఎక్స్ప్రెషన్’తో కూడి ఉండేలా జాగ్రత్తపడండి.


5. ఒకవేళ కథా చౌర్యం జరిగిందని ఒక రచయిత అభియోగం చేసినప్పుడు, అభియోగానికి గురైన కథలో ఏయే పోలికలు ఉన్నాయని ఫిర్యాదుదారుడు అభిప్రాయ పడుతున్నాడో, వాటిని ఫిర్యాదుదారుడు రాతపూర్వకంగా ఇవ్వాలి. ఆ పోలికల విషయమై కాగితాన్ని ప్రతివాదికి పంపి, సమాధానం తీసుకోవాలి. ఆ తరువాత ‘కో-ఆర్డినేషన్ కమిటీ’కి గాని, కథా హక్కులవేదికకు గాని ఫిర్యాదుదారుడు తెలియజేసిన పోలికలను, దానికి ప్రతివాది ఇచ్చిన సమాధానాలను జతపరచి వివాద పరిష్కారం కోసం అప్పచెప్పబడుతుంది.


6. అభియోగానికి గురైన వ్యక్తి గానీ, అభియోగం చేసిన వ్యక్తి గానీ కమిటీ మెంబర్లని గానీ, ప్రధాన కార్యదర్శిని గానీ, అధ్యక్షులని గానీ ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే ఆ సభ్యుని మీద క్రమశిక్షణా చర్య తీసుకోవడానికి కార్యవర్గానికి పూర్తి అధికారం వుంటుంది.


7. ఏ భాషా చిత్రమైన చూసి ఆ సినిమా కథని అనుసరించి రాసి, ‘రిజిష్టర్’ చేసుకున్న కథల మీద, అభియోగం స్వీకరించబడదు. అలాంటి అభియోగం ఇచ్చిన వ్యక్తిపై రచయితల సంఘ కార్యవర్గం కి తగిన చర్య తీసుకొనే అధికారం ఉంటుంది.


8. ఎవరైనా ఒక నిర్మాత గాని, ఒక దర్శకుడు గాని, ఒక నటుడు గాని, ఒక రచయిత దగ్గర కథ విని, తరువాత అతన్ని వదిలేసి అదే ‘స్టోరీ ఐడియా’ మీద గనుక ‘ఎక్స్ప్రెషన్’ మార్చుకుంటూ సినిమా తీస్తున్నాడని, తన కథను వారికి చెప్పానని రచయిత నిరూపించగలిగితే, ఆ కథ మన కార్యాలయంలో ‘రిజిష్టర్’ అయి వుంటే ఆ ‘స్టోరీ ఐడియా’ కి సంఘం రక్షణ కల్పించి, రచయిత పక్షాన నిలుస్తుంది.


9. అభియోగానికి గురి అయిన కథలో కాపీరైట్ ఉల్లంఘనకి చెప్పుకోదగ్గ భాగం, అంతకు ముందు విడుదలయిన సినిమాలలో కానీ, అచ్చు అయిన రచనల నుంచి కానీ, రంగస్థల, రేడియో, టీ.వి. మొదలగు మాధ్యమాల ద్వారా కానీ కాపీరైట్ పొంది ఉన్న భాగాలు ` ఉన్నట్లయితే అది నాది అనే హక్కు, అభియోగం చేసిన రచయితకు ఉండదు. ఎందుకనగా, ఆ ‘ఎక్స్ప్రెషన్’ యొక్క ‘కాపీరైట్’ వేరే వారికి ఉంది కనుక.


10. ఒక ఐడియాలో ‘క్యారెక్టర్స్’ మార్చి రాసినా, ‘ఎక్స్ప్రెషన్’ పరిగణనలోకి తీసుకోబడుతుంది. చెప్పబడిన కథకి హక్కులు ఉండవు. ‘రిజిష్టర్’ అయిన కథకే హక్కులు ఉంటాయి కనుక తప్పని సరిగా ‘రిజిష్టర్’ చేసుకున్న తర్వాతే కథను ఎవరికైనా చెప్పాలి.


11. మీరు మీ కథ కొరకు ‘స్క్రిప్టు అసిస్టెంట్స్’ గా ఎవరినన్నా ‘అప్పాయింట్’ చేసుకుంటే మీ సినిమా కథ విషయంలో వారి హక్కులేమిటి? అనే విషయంలో స్పష్టంగా ఒక ‘నిర్ధారణ’ అంగీకారపత్రం లేదా అవగాహనా పత్రం రాసుకోవాలి.


12. కథా హక్కుల వివాదం విషయంలో న్యాయస్థానానికి వెళ్ళకుండా, రచయితల సంఘం కో`ఆర్డినేషన్ కమిటీ మధ్యవర్తిత్వాన్ని కోరిన సభ్యులు ఆ మధ్యవర్తిత్వానికి కట్టుబడి ఉండాలి. అలా కాకుండా ‘టెంట్లు’ వెయ్యడం, ‘ప్రెస్మీట్’ లు పెట్టడం, ‘టి.వి. మీడియాల’ కు వెళ్ళడం లాంటి చర్యలకు పాల్పడితే క్రమశిక్షణ చర్య తీసుకోబడుతుంది.


కథలు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు సభ్యులు పాటించవలసిన నిబంధనలు :

1.‘స్టోరీ రిజిస్ట్రేషన్’ చేయించుకునే సభ్యులు తమ ‘ఐ.డి.కార్డ్ జిరాక్స్’ తప్పక తీసుకొని రావలెను. సభ్యుడు తప్పక వచ్చి రిజిస్టర్ లో సంతకం చేయవలెను.


2.20 పేజీలకు తక్కువ వున్న కథలు ‘రిజిస్టర్’ చేయబడవు.


3. A -4 సైజు పేపర్ లో ఒకవైపు మాత్రమే రాయడం కానీ, డి.టి.ఫి  చేయడం కానీ ఉండాలి.


4. ప్రతి పేజీకి కింది భాగంలో 2 ఇంచెస్ మార్జిన్ వదలాలి. అక్కడ స్టాంపు లు వేస్తారు.


5. ప్రతి పేజీకి పేజీ నంబర్లు పేజీకి పైన కుడివైపు తప్పకుండ వేయాలి.


6. కథ మొదటి పేజీలో పైన  రచయిత పేరు, ఐడి నెంబరు, టైటిలు, మొత్తం పేజీల వివరాలు తప్పనిసరిగా రాయాలి.


7. అసోసియేట్ మెంబర్షిప్ ‘రెన్యువల్ బకాయి’ వున్నవారి కథ ‘రిజిస్టర్’ చేయబడదు. (ఆ బకాయి డి.డి./ నెఫ్ట్ / డెబిట్ కార్డు స్వైప్ రూపములో మాత్రమే చెల్లించవలెను. చెక్కులు గాని, నగదుగాని తీసుకోబడవు.)


8. ఒక గీతం ‘రిజిస్టర్’ చేసుకుంటే రూ.200/-లు, 20 నుంచి 25 పేజీల్లో కథ/ గీతాలు రిజిస్టర్ చేసుకుంటే రూ.300/-లు చెల్లించాలి.


9.కథ ‘రిజిస్టర్’ అయిన తరువాత ప్రతి పేజీమీద ‘ఆఫీసు సీలు’, నియమించబడిన కార్యవర్గం సంతకం ఉన్నది, లేనిదీ  పరిశీలించుకొని, రశీదు తీసుకొని వెళ్ళవలెను.

కథ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఈ క్రింది విధంగా వుంటాయి :

20 నుండి 25 పేజీలకు – రూ. 300/- లు 151 నుండి 175 పేజీలకు రూ. 2100/-

26 నుండి 50 పేజీలకు రూ. 600/- లు 176 నుండి 200 పేజీలకు రూ.2400/-

51 నుండి 75 పేజీలకు రూ. 900/- లు 201 నుండి 225 పేజీలకు రూ.2700/-

76 నుండి 100 పేజీలకు రూ. 1200/- లు 226 నుండి 250 పేజీలకు రూ.3, 000/-

101 నుండి 125 పేజీలకు రూ. 1500/- లు 251 నుండి 275 పేజీలకు రూ.3, 300/-

126 నుండి 150 పేజీలకు రూ. 1800/- లు 276 నుండి 300 పేజీలకు రూ.3, 600/-

301 నుండి 325 పేజీలకు రూ. 3900/- లు 326 నుండి 350 పేజీలకు రూ.4200/-

351 నుండి 375 పేజీలకు రూ. 4500/- లు 376 నుండి 400 పేజీలకు రూ.4800/-

401 నుండి 425 పేజీలకు రూ. 5100/- లు 426 నుండి 450 పేజీలకు రూ.5400/-

451 నుండి 475 పేజీలకు రూ. 5700/- లు 476 నుండి 500 పేజీలకు రూ.6000/-